ఓం సాయి రామ్
ఈ పుస్తకం మొదలు పెట్టె ముందు నేను సాయి నాధునికి పూర్తిగా సమర్పించుకుంటున. నన్ను ఈ పుస్తకం వ్రాయడానికి ప్రేరేపించి నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి బాబా కి నా కృతఙ్ఞతలు. నేను నిమ్మిత్తమాత్రురాలు, నా ద్వారా బాబా నే ఈ పుస్తకం వ్రాశి వారు చెప్పాలి అనుకున్నది ప్రజలకి చెపుతున్నారు. ఓం సాయి నాధాయ నమః సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
వినాయక శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
నియమాలు
- ఉపవాసం చేయరాదు. బాబా ఉపవాసం ఎప్పుడు బోధించలేదు ఇంకా వొద్దు అని చెప్పినట్లు సత్చరిత్ర గ్రంధం ధ్వారా మనకి తెలుస్తుంది.
- ఏమైనా తిన్న తరువాతే ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టండి
- బాబా పై పూర్తి నమ్మకం ఉంచండి బాబా మీ ప్రార్ధన విని మీ కోరిక తీరుస్తారు అని నమ్మండి. ఏ ఆలోచన ఈ నమ్మకాన్ని పోగట్టనివ్వకండి
- ఆలెస్యం అవుతున్నా ఓపికతో ఉండండి. అవ్వాల్సిన సమయానికి బాబా మీ కోరిక తప్పక తీరుస్తారు
- మీ ఆలోచనలు దృష్టి పూర్తిగా బాబా పై ఉంచండి
- మీరు ఈ పుస్తకం వేరొకలికి ఇచ్చినపుడు మీరు నిర్దేశించిన నియమాలు బోదించకండి. భక్తులు వాళ్లకి ఇష్టం అయినట్లు బాబా ను ప్రార్దిస్తేనే బాబా కి ఇష్టం అనే విషయం మర్చిపోకండి
విధానం
- గురువారం ఏదైనా తిన్న తరువాత మొదలుపెట్టండి. మీ ఇచ్చానుసారం 5,7,9 లేక 11 గురువారాలు గాని మీ కోరిక తీరే వరకు గాని చేయండి
- వినాయకుని స్త్రోత్రం తొ మొదలుపెట్టండి
- సత్చరిత్ర నించి తీయబడిన బాబా పలుకులు అన్నీ చదవండి. వీటి తరువాత ఇచ్చిన కధలు శ్లోకాలు మీ సమయం ఇచ్చానుసారం చేయండి. ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం తక్కువ సమయం లో బాబా ప్రమాణాలు బోధనలు స్మరణం చేసుకోవడం
ఆధారం - సాయి బాబా సత్చరిత్ర గ్రంధం
బాబా పలుకులు (సాయి సత్చరిత్ర లో టూకీగా రాయబడినవి)
- నా లీలలు వ్రాసినచో నవిద్య నిష్క్రమించి పోవును. వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినెదరో వారకి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును (3)
- "నా నామము ప్రేమతో నుచ్చరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడువారి కంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనములనుండి తప్పించుట నా ముఖ్యలక్షణము. ప్రపంచములోని వానినన్నిటిని మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకముగలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును." (3)
- “మీ రెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించు వాడను; అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరిచినవారిని వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే.”
- "నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీ కేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచం లో కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్భారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవముయొక్క యాకారము నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనునట్లు మనస్సును నిలుపుము. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను, యెట్టి చికాకు లేక యుండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగ నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే".
- భక్తుల కష్టములన్నియు నావిగనే భావించెదను
- మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము (9)⁰
- కుక్కలు, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటి యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము (9)
- హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయులదైవమగు రహీమును ఒక్కరే. వారిరువురిమధ్య యేమీ భేదములేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట యెందులకు? ఓ అజ్ఞానులారా! చేతులు-చేతులు కలిపి రెండు జాతులును కలిసిమెలిసి యుండుడు. బుద్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదమువల్లగాని, ఘర్షణవల్లగాని ప్రయోజనములేదు. అందుచే వివాదము విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీయొక్క వృద్ధిని, మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైన అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైవ మీకు కీడుచేసినచో, ప్రత్యుపకారము చేయకుడు. ఇతరులకొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు (10)
- బానిసలలో బానిసనగు నేను మీకు ఋణస్థుడను. మీదర్శనముచే నేను తృప్తుడనై తిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యశుద్ధములో నేనొక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను (10)
- నేను ఎప్పుడూ ఎవ్వరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగగొట్టునా నేను మిమల్ని ఎందుకు నిరాకరించెదను. నేను ఎప్పుడూ మీ యోగక్షేమములే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను నేను ఎప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. నేను ఎప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే (11)
- నేను ఫకీరయి నప్పటికి, యిల్లుగాని భార్యగాని లేనప్పటికి, ఏ చీకు చింతలు లేనప్పటికి ఒకేచోట నివసించుచున్నాను. తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరనగ దానికెంత? ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల ఆమె బారినుండి తప్పించుకొందురు. (13)
- ఎవరు అదృష్టవంతులో యెవరి పాపములు క్షీణించునో, వారు నాపూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములుగాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరములేదు. భక్తి యున్నచోటనే నా నివాసము (13.1)
- నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధ లున్న వారైనను ఎప్పుడయితే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరిని ప్రేమతోను దయతోను కాపాడెదరు (13.2)
- నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. శరీరముతో నేనిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీ కిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజనహృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు; పావనులు; అదృష్టవంతులు (15.2)
- బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులను సమర్పించవలెను. అవి యేవన :- 1. పంచ ప్రాణములు; 2. పంచేంద్రియములు; 3. మనస్సు; 4. బుధ్ధి; 5. అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమయినది. అది కత్తివాదరవలె మిక్కిలి పదునైనది. అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము. - పూర్తి వివరణ కావాలి అనుకుంటే 16, 17 అధ్యాయం బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత చూడండి
- లోభికి శాంతి గాని, సంతుష్టిగాని, దృఢనిశ్చయముగాని యుండవు. మనస్సునం దేమాత్రము పేరాశ యున్నను సాధనలన్నియు (ఆధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ప్రయోజనములు.మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు
- నా పద్దతి మిక్కిలి విశిష్ఠమైనది. ఈ ఒక్క కథను (శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్ అధ్యాయం 18,19) జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యాన మవసరము. దాని నలవరచు కొన్నచో వృత్తులన్నియును శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకారస్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు, చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును
- ఎదైన సంబంధ ముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగ ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనముకొఱకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట కిష్టము లేకున్నచో, నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను, నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నీశ్చయముగా నీకు సంతోషము కులుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికి నీవు చలించకుము. నీ వున్న చోటనే స్థైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గ మేర్పడును. నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన కైక్యత కలుగదు, 'అల్లా మాలిక్' భగవంతుడే సర్వాధి కారి. ఇతరు లెవ్వరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గ మసామాన్యము; మిక్కిలి విలువైనది; కనుగొన వీలు లేనిది. వారి యిచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన ఋణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరి కొకరు తోడ్పడి ప్రేమించి సుఖఃముగాను, సంతోషముగాను నుందుము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందెరరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు.
- నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. బాబా వానికొక పందిని జూపి యిట్లనెను. "చూడుము! ఈ పంది అశుద్ధం యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునేతిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగ నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా" - మలినమును పోగొట్టుట కనేకమార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒకవిధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు గావున తిట్లుబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను.
- బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా మూడున్నర మూరల శరీరమని యనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. ఎవరైన సర్వస్యశరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో, చక్కెర-తీపి, కెరటములు-సముద్రము, కన్ను-కాంతి, కలిసి యున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరయితే చావుపుట్టుకలనుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మికజీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు భాధించునట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తనకర్తవ్య కర్మల నాచరించుచు భగవంతునికి సర్వస్యశరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని, యితరులకు చెప్పెదరో, ఇతరవిషయము లేమియు నాలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు.
- ఒకరి కష్టము నింకొక రుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెను
- భగవంతుడు సకలజీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని, తేళ్ళుగాని కానిడు. ఈ ప్రపంచమును నడిపించు సుత్రధారి భగవంతుడు. సకలజంతుకోటి పాములు, తేళ్ళతో సహా, భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞయైనగాని యెవరు ఇతరులకు హాని చేయలేరు. ప్రపంచమంతయు వానిపైనాధారపడి యున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను. దేవుడందరిని రక్షించువాడు (22)
- ప్రక్కన ఉన్నవారికి పెట్టకుండా ఏమీ తినరాదు. తాను ఒక్కడే తినడం దుర్గుణం. ఎవ్వరును దగ్గరలేనపుడు తినుటకు ముందు నన్ను స్మరింపుము నేను ఎల్లపుడు మీ చెంతే ఉండెను అని మరవకండి (24)
- భక్తుల యిష్టానుసారము సేవచేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదు (24)
- సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధికూడ మాట్లాడును; కదులును. మనస్ఫూర్తిగ శరణుజొచ్చినవారితో మాట్లాడును. నేను మీవద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలుపొందెదరు. (25)
- సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడు చున్నారు. వారందరు బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. "మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెన రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును."
- ఎక్కడైనను నెప్పుడయినను నా గురించి చింతించినచో నే నక్కడనే యుండెదను.
- ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము (26)
- ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును (26)
- ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను (28)
- నీవు చేసిన కర్మఫలితమును నీవే యనుభవింపవలెను. (29)
- ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలిసికొని నీ కర్తవ్యమును జేయుము, ఇహలోక పరలోక వస్తువు లన్నిటియందు గల యభిమానమును విడిచి పెట్టుము. ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే ప్రేమభక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో, వారికి దేవుడు పరుగెత్తిపోయి, సహాయము చేయును (31)
- "ఉపవాసము చేయవలసిన యవసరమేమి?" - బాబా యెన్నడు ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థ మెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. (32)
- దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు "తీసికో, తీసికో" అనును కాని, ప్రతివాడు నావద్దకు వచ్చి 'తే,తే' యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువా డొక్కడును లేడు. నాసర్కారు (ప్రభువు) యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగానున్నది. అది అంచువరకు నిండి పొంగిపోవుచున్నది. నేను "త్రవ్వి, ఈ ధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము నంతయు ప్రోగుచేసుకోవలెను." అనుచున్నాను. నా ఫకీరు చతురుత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల యమోఘమైనవి. నా సంగతి యేమి? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి యవకాశము తిరిగి రాదు. నే నెక్కడికో పోయెదను; ఎక్కడనో కూర్చుండెదను; మాయ నన్ను మిగులబాధించుచున్నది. ఐనప్పటికి నావారికొరకు ఆతురపడెదను. ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో, వారమూల్యమైన యానందమును పొందెదరు
- నేను భగవంతుని సేవకుడను. వారి యాజ్ఞానుసారము మీ యోగ క్షేమములను కనుగొనుటకు వచ్చితిని (33)
- ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాదపడరు. కనుక హాయిగ నుండుడు. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును (34)
- అసలయిన విరుగు డేమనగా గతజన్మపాపము లనుభవించి, విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని నోర్చుకొనుము. అల్లాయే యార్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు, సమస్తము అర్పింపుము. అనగా సర్వస్యశరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము
- కర్మయొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణ భూతునిగా నెంచెదరు. అది యదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్రహృదయులు. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన యహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు.
- నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య నున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచు కొనగలము; కలిసికొనగలము (35)
- నేను ఒక రూపాయి దక్షిణ యెవరివద్దనుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండగ నే నెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయిపోవును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీ విప్పు డనుభ వించలేవు. కనుక ధనమును పొందవలెననినచో. దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును.
- నేనెవరివద్ద ఏమియు తీసికొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీయున్న వాడు చెల్లించి, ఋణవిమోచనము పొందును. నా కిల్లుగాని, ఆస్తిగాని, కుటుంబము గాని గలవా? నాకేమీ యక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. ఋణము, శతృత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు (36)
- నన్నే గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను (40)
- కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది. కుక్కకుకూడ ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము (42)
- ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరయితే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షము నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడియుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో, వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను. (43, 44)
- నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్ని జీవులలోను, చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు
- ఎవరయితే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు
- మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరులవద్ద నున్నది (45)
- భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును (47)
- నా యందే నమ్మకముంచుము. నీ మనోభీష్టము నెరవేరును (48)
- ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగ జేసికొన గూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరచియుండగా, వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు, నేమియు దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడనేల? నేత్రములు వానిపని యవి నెరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల.
పైన బాబా చెప్పిన మాటలికి నాన ఇచ్చిన వివరణ - మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునం దుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని, మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను, సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును.
51. మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును
శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్ - #17 (అధ్యాయం 18,19)
రాధాబాయి యను ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాభా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనో నిశ్చయము చేసికొనెను. ఆమె కింకేమియు తెలియకుండెను. బాబా యామెను ఆమోదించక మంత్రోపదెశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మూడుదినములవరకు మానివేసెను. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని. "దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని, నీ వెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడియున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంతవరకామె యిట్లు చేయనున్నది. ఏమైన హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశ మివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెనుకరుణించుము. ఆశీర్వదించుము. తగిన సలహా యిమ్ము". ఆమె మనో నిశ్చయమును జూచి, బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను.
"ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగ వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీ కది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలాకాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారిసేవ చేయుటకు, వారివద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి; రెండు పైసలు దక్షిణ యడిగిరి. వెంటనే యిచ్చితిని. "మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు?" అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది? వారు కోరిన రెండు కాసులు 1. దృఢమైన విశ్వాసము 2. ఓపిక లేదా సహనము. నేనీ రెండు కాసులను లేదా వస్తువులను వారి కర్పించితిని, వారు సంతోషించిరి.
నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకుగాని వస్త్రమునకుగాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్ప వచ్చును. నేను దాని నెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచునప్పుడు, వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండిరి. మేమిద్దర మానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టినిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియిందే నాటుకొని యుండెడిది. ఇదియే ఒక పైసా దక్షిణ. సాబూరి (ఓపిక) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి యనునది పురుషలక్షణము. అది పాపము లన్నిటిని తొలగించి, భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును. సాబూరి యనునది సుగుణములకు గణి, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ (నమ్మకము), సాబూరి (ఓపిక) అన్యోన్యముగా ప్రేమించు అక్క చెల్లెండ్రవంటివారు.
నా గురువు నానుండి యితర మేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను గూడ మా గురువుదృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున నుండును. బిడ్డతాబేలు రెండవ యొడ్డున ఉండును. తల్లి తాబేలు, పిల్లతాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దది యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిల్పి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లీ! నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్ర మెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువు నందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయు వాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహర బ్రహ్మల (త్రిమూర్తుల) యవతారమని యెంచెదరో వారే ధన్యులు."
ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యాముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదులుకొనెను.
ప్రార్థనం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే |
ఫలశ్రుతి
ఈ పుస్తకం పఠిస్తూ సాయి బాబా కి సర్వస్యశరణాగతి వేడిన వారి కోరికలు తీరును. వారి సందేహాలు తీరి బాబాపై ఎనలేని భక్తి కలుగుతుంది. బాబా పై పూర్తి భారం వేసి ఎటువంటి సంకోచాలు లేకుండా శ్రద్ధ సబూరీ తో ఈ పూజ చేసినవాళ్లకి తప్పక బాబా అనుగ్రహం కలుగుతుంది బాబా వారిని అన్ని కష్టాలనించి కాపాడతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం సాయి నమో నమః
శ్రీ సాయి నమో నమః
జై జై సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్|
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||
సాయి గాయత్రీ మంత్రం
ఓం షిర్డీ వసాయ విడమహే
సచిదానందయా ధీమహే
తన్నో సాయి ప్రచోదయాత్
సాయి బాబా అష్టోత్తర శత నామావళి
ఓం సాయినాథాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదావరీతట శిరడీ వాసినే నమః
ఓం భక్త హృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమః
ఓం కాలాతీ తాయ నమః ॥ 10 ॥
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాల దర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్త్యాభయ ప్రదాయ నమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తా వన సమర్థాయ నమః
ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః ॥ 20 ॥
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధన మాంగల్యదాయ నమః
ఓం బుద్ధీ సిద్ధీ దాయ నమః
ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
ఓం యోగక్షేమ మవహాయ నమః
ఓం ఆపద్భాంధవాయ నమః
ఓం మార్గ బంధవే నమః
ఓం భుక్తి ముక్తి సర్వాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః ॥ 30 ॥
ఓం ప్రీతివర్ద నాయ నమః
ఓం అంతర్యానాయ నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం ఆనంద దాయ నమః
ఓం ఆనందదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం జ్ఞాన స్వరూపిణే నమః
ఓం జగతః పిత్రే నమః ॥ 40 ॥
ఓం భక్తా నాం మాతృ దాతృ పితామహాయ నమః
ఓం భక్తా భయప్రదాయ నమః
ఓం భక్త పరాధీ నాయ నమః
ఓం భక్తానుగ్ర హకాతరాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
ఓం జ్ఞాన వైరాగ్యదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం సంశయ హృదయ దౌర్భల్య పాపకర్మవాసనాక్షయక రాయ నమః
ఓం హృదయ గ్రంధభేద కాయ నమః ॥ 50 ॥
ఓం కర్మ ధ్వంసినే నమః
ఓం శుద్ధసత్వ స్ధితాయ నమః
ఓం గుణాతీ తగుణాత్మనే నమః
ఓం అనంత కళ్యాణగుణాయ నమః
ఓం అమిత పరాక్ర మాయ నమః
ఓం జయినే నమః
ఓం జయినే నమః
ఓం దుర్దర్షా క్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేసు అవిఘాతగతయే నమః
ఓం అశక్యర హితాయ నమః ॥ 60 ॥
ఓం సర్వశక్తి మూర్త యై నమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం మహారూప విశ్వమూర్తయే నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంత ర్యామినే నమః
ఓం మనో వాగతీతాయ నమః
ఓం ప్రేమ మూర్తయే నమః ॥ 70 ॥
ఓం సులభ దుర్ల భాయ నమః
ఓం అసహాయ సహాయాయ నమః
ఓం అనాధ నాధయే నమః
ఓం సర్వభార భ్రతే నమః
ఓం అకర్మానే కకర్మాను కర్మిణే నమః
ఓం పుణ్య శ్రవణ కీర్త నాయ నమః
ఓం తీర్ధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగ తయే నమః
ఓం సత్పరాయణాయ నమః ॥ 80 ॥
ఓం లోకనాధాయ నమః
ఓం పావ నాన ఘాయ నమః
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కర ప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతశ్చర్యాది సువ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం సిద్ద సంకల్పాయ నమః
ఓం యోగేశ్వరాయ నమః
ఓం భగవతే నమః ॥ 90 ॥
ఓం భక్తావశ్యాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్త్వబోధ కాయ నమః
ఓం కామాదిష డైవర ధ్వంసినే నమః
ఓం అభే దానందానుభవ ప్రదాయ నమః
ఓం సర్వమత సమ్మతాయ నమః
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశ్వర మణాయ నమః
ఓం అద్భుతానంద చర్యాయ నమః ॥ 100 ॥
ఓం ప్రపన్నార్తి హరయ నమః
ఓం సంసార సర్వ దు:ఖక్షయకార కాయ నమః
ఓం సర్వ విత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వాంతర్భ హిస్థితయ నమః
ఓం సర్వమంగళ కరాయ నమః
ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమః
ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః ॥ 108 ॥
సాయి చాలీస
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా
కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి
నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం
చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం
నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం
కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు
శరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి
అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం
ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి
వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!
షిరిడి సాయి బాబా ఆరతి
ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ
చరణ రజతాలీ ద్యావా దాసావిసావా
భక్తావిసావా ఆరతిసాయిబాబా
జాళునియ అనంగ సస్వరూపిరాహేదంగ
ముమూక్ష జనదావి నిజడోళా శ్రీరంగ
డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా
జయమని జైసాభావ తయ తైసా అనుభవ
దావిసి దయాఘనా ఐసి తుఝీహిమావ
తుఝీహిమావా ఆరతిసాయిబాబా
తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యధా
అగాధతవకరణి మార్గ దావిసి అనాధా
దావిసి అనాధా ఆరతి సాయిబాబా
కలియుగి అవతారా సద్గుణ పరబ్రహ్మా సాచార
అవతీర్ణ ఝూలాసే స్వామీ దత్త దిగంబర
దత్త దిగంబర ఆరతి సాయిబాబా
ఆఠాదివసా గురువారీ భక్త కరీతివారీ
ప్రభుపద పహావయా భవభయ నివారీ
భయనివారీ ఆరతి సాయిబాబా
మాఝానిజ ద్రవ్యఠేవ తవ చరణరజసేవా
మాగణే హేచి^^ఆతా తుహ్మా దేవాదిదేవా
దేవాదిదేవ ఆరతిసాయిబాబా
ఇచ్ఛితా దీనచాతక నిర్మల తోయనిజసూఖ
పాజవే మాధవాయా సంభాళ అపూళిబాక
అపూళిబాక ఆరతిసాయిబాబా
సౌఖ్యదాతార జీవా చరణ రజతాళీ ద్యావాదాసా
విసావా భక్తావిసావా ఆరతి సాయిబాబా
హేమాడ్ పంతు ప్రార్థన (25)
"ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములందు, దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగ నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువలన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేముసంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది."
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.
కొన్ని అనుభవాలు
టైఫాయిడ్ నించి కాపాడుట
నాకు 14 ఏళ్ళ అప్పుడు నాకు బాగా జ్వరం చేసింది. ఇంతక ముందు ఎప్పుడు అంత జ్వరం రాలేదు వారం అయినా కూడా తగ్గలేదు. బాగా నీరసం అయ్యి నేను మంచం కూడా దిగలేకపోయేదాని. ఒక రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది అది ఇప్పటికి నాకు కాళ్లకికట్టినట్లు గుర్తువుంది - నేను డాక్టర్ ఆఫీస్ లోపల వేచివుండగా నా దగ్గరికి ఒక ఉద్యోగి (బాబా) వచ్చి నాకు లోపల అంత తిప్పి అన్నీ చూపించారు అక్కడ నోటీసు బోర్డు మీద ఏవో బొమ్మలు చూపించి తరువాత బయటికి చల్ల గాలికి తీసుకువెళ్లి అక్కడ నాతో ఆడుకున్నారు. ఆ తర్వాత నించి నేను నెమ్మదిగా కోలుకున్నాను. నేను పూర్తిగా కోలుకున్నాక నాకు మా అమ్మ నాన్న నిజం చెప్పారు వారు నా గురించి చాలా కంగారుపడ్డారు అని ఎందుకంటే నాకు వచ్చింది మాములు జ్వరం కాదు టైఫాయిడ్ అని.
ఉద్యోగం
హరిణి అనే అమ్మాయి తన 17 వయేట తన కుటుంబముతో విదేశం లో స్థిరపడింది. తనకి ఉద్యోగం చేసి డబ్బులు దాచుకుని భారతదేశం వెళ్ళిరావాలి అని బలమైన కోరిక. గాని తను వున్నది చిన్న ఊరు కాబట్టి తనకి ఏ ఉద్యోగం దొరకలేదు. ఏడు నెలలు ప్రయత్నించాక తను బాబా 7 రోజుల పారాయణం చేయడం మొదలు పెట్టింది. ఆ శుక్రవారం తాను ఒక కాఫీ షాప్ లో అప్లికేషన్ పెట్టింది, తనకి బుధవారం ఆ కాఫీ షాప్ వాళ్లు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కోసం గురువారం రమ్మన్నారు. గురువారం అక్కడికి వెళ్ళాక వాళ్లు కొన్ని ప్రశ్నలు వేసి వెంటనే ఉద్యోగం ఖాయం చేసి అప్పుడే యూనిఫామ్ కూడా ఇచ్చేసారు, వచ్చే రెండు వారాల షిఫ్టు సమయం కూడ అక్కడే చెప్పేసారు. హరిణి ఆనందానికి అంతులేదు. ఆ ఇంటర్వ్యూ కి ముందు ఆ వారం లో హరిణి కి ఒక కల వచ్చింది - తనని కొందరు దుండగులు వెంటబడతుంటే తప్పించుకుని పరిగెడుతుంది. అప్పుడు కాలు జారీ పడిపోబోతూ ఎదో అందుకుని ఆగింది. ఏంటి పటుకున్నానో అని పైకి చూస్తే పెద్ద పెద్ద పాదాలు కనిపించాయి ఇంకా పైకి చూడటానికి ప్రయత్నిస్తే చాలా పొడుగాటి మనిషి కాఫ్ని వేసుకుని ఉన్నటు కనిపించింది
హరిణి కి ఇలాంటి అనుభవం మల్లి అయ్యింది. ఒక బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది అన్న వార్త తనకి గురువారం అందింది. ఆ ఉద్యోగం వల్ల తను వృత్తిపరంగా స్థిరపడింది. మొదట చిన్న హోదా లో చేరింది. తరువాత అదే బ్యాంకు లో వేరొక శాఖలోకి మారడానికి అప్లికేషన్ పెట్టింది చాలా రోజులు అయినా తనకి జవాబు రాకపోడం తో ఉద్యొగం రాలేదు అని నిరాశపడి ఒక రోజు నిరుత్సాహం తో ఏడుస్తూ కూర్చుంది. కొంతసేపట్లో తన సెల్ మొగితే తీసి చూసింది ఆశ్చర్యంగా తనకి డైరెక్టర్ నించి ఇమెయిల్ వచ్చింది తనకి ఆ ఉద్యోగం వచ్చింది అని - ఇది జరిగింది కూడా గురువారమే. ఆ ఉద్యోగం లో తనకి రెండు ప్రొమోషన్లు వచ్చాయి ఎంతో ప్రతిష్టాత్మకమైన షిప్ లో వెళ్లే అవార్డు కూడా అందుకుంది. ఆ ఉద్యోగం వళ్ళ తన జీవితం మారిపోయింది మంచి వృత్తి, జీతం కి దారితీసింది.
కుటుంబం కలుసుకునేలా చేసిన లీల
నీలిమ తన కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండేవారు ఎప్పుడూ విడివిడిగా లేరు. గాని ఒకసారి ఏవో కారణాల వల్ల కూతురు లేకుండా, నీలిమ, తన భర్త, కొడుకు, కోడలు వేరే రాష్ట్రం లో స్థిరపడాల్సి వచ్చింది. తన కూతురికి పనిచేస్తున్న చోట బదిలీ వచ్చాక తను వస్తాది అనుకున్నారు. సంవత్సరం దాటినా బదిలీ అవ్వలేదు. కూతురు ఒంటరిగా ఉండిపోయింది అన్న బాధ నీలిమ కి తన భర్త కి ఒక పక్క తల్లితండ్రులకి దూరంగా వంటరిగా కూతురి బాధ ఇంకో పక్క మానసికంగా వాళ్లు చాలా కష్టపడ్డారు. అప్పుడు నీలిమ స్నేహితురాలు తనికి సాయి బాబా 9 వారాల వ్రతం గురించి చెప్పింది. నీలిమ తన కూతురు ఇద్దరు ఆ వ్రతం చేసారు. సరిగ్గా తొమ్మిది వారాలు అయ్యాక మ్రొక్కు చెలించడానికి నీలిమ గురువారం గుడికి వెళ్ళింది. తను గుడి లో ఉండగా కూతురు ఫోన్ చేసి తనకి ఉద్యోగం వచ్చింది అన్న శుభవార్త చెప్పింది. నెల తిరిగే లోపు కూతురు వచ్చే సౌకర్యాలు మొదలుపెట్టారు. దానికోసం ఇల్లు మారే అవసరం వుంది ఎంత వెతికినా అందరికీ సరిపడేలాంటి ఇల్లు దొరకలేదు. చివరికి బాబా దయవల్ల చాలా మంచి సౌకర్యం అయిన అందరికి అనుకూలమయిన ఇల్లు దొరికింది.
సంకోచం తీర్చుట
ఆరాధ్య కి 29 సంవత్సరాలు పెళ్లి అయి ఆరుయేళ్లు అయింది గాని పిల్లలు కావాలి అనుకోలేదు. తను పిల్లలు కనటానికి సిద్ధమా కాదా చూసుకోగలదా లేదా అనే సంకోచంలో ఉంది. దారి చూపమని బాబా కి వేడుకుంది. ఒక రోజు తనకి ఒక కల వచ్చింది - తను డాక్టర్ దగ్గరకి వెళ్ళింది అక్కడ పరిక్షలు చేసి తను కడుపుతో ఉంది అని డాక్టర్ చెప్పారు తను పైకి చూస్తే బాబా తనవైపు నవ్వుతూ చూస్తునట్టు కనిపించారు. రెండు రోజుల తర్వాత గురువారం నాడు తను గుడికి వెళ్ళింది. వెన్నకి వచ్చే సమయం లో తను వాళ అమ్మ తో మాట్లాడుతూ ఈమధ్య తన ఆరోగ్యం లో మార్పులు గురించి చెప్తునపుడు తనకి అనుమానం వచ్చి ఇంటికి వెళ్లగానే ప్రెగ్నన్సీ టెస్ట్ చేసుకుంది ఆశ్చర్యకరంగా అది పాజిటివ్ వచ్చింది. బాబా ఆశీర్వాదం తో ఒక పాప కి జన్మనిచ్చింది.
ఉద్యోగం
లత తన భర్త ఇల్లు కొనుకోవడానికి కొంత డబ్బు అడ్వాన్సుగా కట్టారు. ఇంకా కొన్ని రోజుల్లో బ్యాంకు లో అప్పు తీసుకొని ఇల్లు పూర్తిగా కోనేలోపు లత ఉద్యోగం పోయింది. మూడు నెలల్లో బేరం అయిపోవాలి గాని ఉద్యోగం లేనిదే వాళ్లు ఆ ఖర్చు తట్టుకోలేరు. లత బాబా ని దారి చూపమని పూర్తి శ్రద్ధ నమ్మకం తో బాబా ఏడ రోజుల పారాయణం మొదలుపెట్టింది. ఎలాంటి సంకోచం తన మనసులోకి రాకుండా పూర్తి భారం బాబాపై వేసి భక్తి తో వుంది. ఒక రాత్రి తనకి ఈ కల వచ్చింది - లతా తన భర్త అమ్మ నాన్నల తో ఇంటర్వ్యూ కోసం ఒక ఊరి వెళ్లి హోటల్ గదిలో ఉంది. ఎందుకో గుమ్మందాటి బయటికి వెళ్లి లోపలి వచ్చింది వచ్చి చూసేసరికి గది మొత్తం బాబా ఫోటోలుతో నిండిపోయింది. తను చాలా సంతోషంతో వాళ అమ్మ తో ఇలా అంది 'బాబా కనిపించారు అంటే నాకు ఈ ఉద్యోగం వచేసినట్లే' ఈ కల వచ్చింది మంగళవారం. బుధవారం తన పారాయణం ఆఖరి రోజు పూజ చేసి దీపం పెట్టుకొని వచ్చి సెల్ చూసేసరికి ఒక ఇమెయిల్ వుంది - మఱునాడు అనగా గురువారం ఇంటర్వ్యూ కి సిద్ధంగా ఉండమని. గురువారం అంటే బాబా దీవెన అని నమ్మి బాగా చదివి ధైర్యంగా ఇంటర్వ్యూ చేసింది. బాబా దయ వల్ల ఆ ఉద్యోగం వచ్చింది. తన వృత్తిలో స్థిరపడటానికి అది చాలా మంచి అవకాశం జీతం కూడా తను అనుకున్నదానికంటే చాలా ఎక్కువే. రాజా ది రాజా యోగి రాజ అఖిలార్థకోటి భ్రహ్మాండ నాయక సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
పోయిన నగలు దొరుకుట
కుమారి ఇల్లు మారుతునప్పుడు జాగ్రత్తగ తన బంగారు నగలు ఒక పెట్టెలో దాచుకుంది. ఇల్లు మారాక సర్దుకుంటునప్పుడు తనకి ఆ పెట్టెలో ఒక గొలుసు ఉంగరం కనిపించలేదు. ఎంత వెతికిన ఎక్కడ వెతికిన కనిపించలేదు. కొన్నాళ్లకి సాయి బాబా 9 వరాల వ్రతం చేసినపుడు ఆ నగల కోసం బాబా ను వేడుకుంది. ఆ నెలలో ఒకరోజు ఆ పెట్టెలో ఎదో పుస్తకం కావాల్సివచ్చి తీసేసరికి ఆశ్చర్యంగా పోయాయి అనుకున్న గొలుసు ఉంగరం ఆ పుస్తకం లో దొరికాయి. బాబా చూపించిన ఈ మహిమకి కుమారి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా బాబా కు నమస్కరించుకుంది
రచయిత గురించి
బాబా నే నన్ను ఆయన సన్నిధిలోకి రప్పించుకున్నారు అని నా నమ్మకం. అమ్మ వలన చిన్నపటి నించి బాబా కధలు వింటూ పెరిగాను చాలా సార్లు అమ్మ తో కలిసి 7 రోజుల పారాయణం చూసేదాన్ని. ప్రతి చిన్న విషయానిక్ బాబా ని తలుచుకోవడం నాకు చిన్నపటి నించే అలవాటు అయింది. బాబా ని దేవుడి గ కొలిచినా ఈ మధ్య మాత్రమే నేను ఆయనని త్రిమూర్తి స్వరూపులుగా గుర్తించాను. సాయి బాబా దత్తాత్రేయుని అవతారం అని చాలా మంది నమ్ముతారు దానికి కొన్ని ఉదాహరణాలు కూడా సాయి సత్చరిత్రలొ వ్రాసారు. దత్తాత్రేయ అంటే మరెవరో కారు త్రిమూర్తి అవతారమే
ఇలా గుర్తించిన తరువాత నాలో తెలియని క్రొత్త నమ్మకం భక్తి శ్రద్ద మొదలు అయ్యాయి. దీనితరువాతే బాబా నన్ను ఈ పుస్తకం రాయటానికి మా అమ్మ ద్వారా ప్రేరేపించారు. గాని ఏంటి వ్రాయాలో తోచకపొతె బాబాగారి పలుకులు సత్చరిత్రలోనివి అన్ని పొందుచేస్తే బాగుంటుంది అన్న ఆలోచన బాబా నాకు ఇచ్చారు
నేను పుట్టకముందు మా అమ్మ కి అయిన అనుభవం నాకు ఈ మధ్యనే చెప్పింది. ఒక రోజు అమ్మ రైల్ స్టేషన్ లో నాన్న గురించి ఆగింది. అప్పుడు ఎక్కడినించో ఒక ఫఖీరు అకస్మాత్తుగా వచ్చి అమ్మ కడుపు దగ్గర చెయ్య చూపిస్తూ నీకు ఆడ పిల్ల పుడుతుంది అని చెప్పి తల మీద చెయ్యి వేసి దీవించి వెళ్లిపోయారు. ఆ ఫఖీర్ ని ఇంతకముందు గాని తర్వాత గాని మల్లి ఎపుడు చూడలేదు మా ఊరిలో. అప్పుడే నాన్న వస్తే అమ్మ ఈ విషయం చెప్పింది అప్పుడు ఆ ఫఖీరు కోసం వెతికితే ఎక్కడ కనిపించలేదు. మా నాన్న వైపు కుటుంబం లో మూడు తరాలనించి ఆడ పిల్ల పుట్టలేదు. అమ్మ కి కూడా మొదటి సంతానం అబ్బాయే కాబట్టి ఫఖీరు మాటల్ని పట్టించుకోలేదు. రెండు వారాల తర్వాత అమ్మ కి కడుపు నొప్పి ఎక్కువగా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, టెస్టులు చేసి డి.ఎన్.సి చేయాలి అన్నారు. నలుగురు డాక్టర్ల తర్వాత ఒక డాక్టర్ ఆపరేషన్ కి ముందు స్కాన్ తీయాలి అని స్కాన్ చేస్తే ఆశ్చర్యంగ కడుపులో బిడ్డ వుంది అని చెప్పారు, అప్పటివరకు అమ్మ కి తెలీదు తను కడుపుతోవున్న విషయం. ఈసారి కూడా అబ్బాయేలె అనుకుంది అంట గాని నేను పుట్టాను. అందరు చాలా సంతోష పడ్డారు. తర్వాత కొన్నాళ్లకి అమ్మ కి ఫఖీరు మాటలు గుర్తుకువచ్చాయి - ఆయనికి అమ్మ గర్భవతి అని తెలియడమే కాకుండా ఆడ పిల్ల పుట్టబోతుంది అని కూడా తెలిసింది కాబట్టి ఆ ఫఖీరు రూపం లో తనని దీవించడానికి వచ్చింది సాయి బాబానే అని మా అమ్మ నమ్మకం
సాయినాథ్ మహారాజ్ కి జై
మౌన లయ